గురువులపై ‘మెగా’ భారం | - | Sakshi
Sakshi News home page

గురువులపై ‘మెగా’ భారం

Jul 10 2025 6:35 AM | Updated on Jul 10 2025 6:35 AM

గురువులపై ‘మెగా’ భారం

గురువులపై ‘మెగా’ భారం

● మెగా పేరెంట్స్‌– టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహణకు నిధుల కొరత ● ఆర్భాటంగా నిర్వహించాలని ఆదేశాలు ● ఉపాధ్యాయులకు వదిలిన చేతి చమురు ● ప్రభుత్వ గొప్పల కోసం టీచర్లపై భారం ● అరకొర నిధులు.. హెచ్‌ఎంల జేబుకు చిల్లు!

పాఠశాలల్లో ‘మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ ’ నిర్వహణ ఉపాధ్యాయులకు భారంగా మారింది. సమావేశాల కోసం కనీసం రూ.7 వేల నుంచి రూ.30 వేల వరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టీ ఖర్చవుతుందని అంచనా. అయితే ఇందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం అరకొరగా విడుదల చేయడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో చాలా మంది ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాలో బుధవారం వరకు కూడా నగదు జమ కాలేదు. మీటింగ్‌ నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలంటూ వారు తలలు పట్టుకుంటున్నారు.

అనకాపల్లి టౌన్‌: గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ రికార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న తాపత్రయం గురువులు, విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇటీవల యోగాంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పడిన కష్టాలను మరవకముందే గురువుల నెత్తిన మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ పేరిట ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. ఇందుకోసం కేటాయించిన అరకొర నిధులు కూడా ఇంతవరకు పలువురు హెచ్‌ఎంల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని హెచ్‌ఎంలు లోలోపల మదనపడుతున్నారు. గురువారం మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం) నిర్వహించాల్సి ఉంది. కష్టపడి మీటింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు చేతి డబ్బులు కూడా ఖర్చు చేయాలా అంటూ హెచ్‌ఎంలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పాఠశాల, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణకు రూ.7 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతుంది. సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులు, వారి పిల్లలకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం స్నాక్స్‌,టీ, వాటర్‌ బాటిళ్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వీటన్నింటిని ఉపాధ్యాయ వర్గాలు కొనుగోలు చేశాయి. అలాగే టెంట్లు, కుర్చీలను కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఖర్చులు అధికంగా ఉంటుండడంతో ఆ సొమ్మంతటిని ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్థికంగా నష్టపోతామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయం అధికారుల వద్ద చెప్పుకున్నా ఫలితం ఉండదని, వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు.

జిల్లాలో 2,11,781 మంది విద్యార్థులు

జిల్లాలో 2,232 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1,87,000 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌, మున్సిపల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలు తదితర వాటితో పాటు ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలున్నాయి. అలాగే 134 జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిలో 24,781 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటన్నింటిలోనూ పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించాలి. తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా ఉపాధ్యాయులు మెలగాలి. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణకు హెచ్‌ఎంలు సిద్ధమయ్యారు.

మౌలిక సౌకర్యాలను పక్కనబెట్టి..

మెగా పేరెంట్స్‌– టీచర్స్‌ మీటింగ్‌ ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులకు తలనొప్పి తెస్తోంది. బడులు తెరిచి నెల రోజులు కావస్తున్నా ఏ పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో యూనిఫామ్‌, షూస్‌, బెల్ట్‌లు, పుస్తకాలు అందించలేదు. కొద్ది మందికి మాత్రమే యూనిఫామ్స్‌ అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీంతో తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఇప్పటికే వివిధ కారణాలతో తల్లికి వందనం ఆపేయడంతో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

చదువులకు దూరం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చదువు కన్నా ప్రచార ఆర్భాటాల కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మొన్న యోగాంధ్ర పేరుతో వారం రోజుల పాటు చదువులకు దూరమయ్యారని, ఇప్పడు పనికి రాని మీటింగ్‌లతో వారం రోజుల పాటు చదువులు చెప్ప లేదని వారు వాపోతున్నారు. ఈ మెగా కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికే పనికి వస్తుందని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement