
గౌరవప్రదమైనది వైద్య వృత్తి
● అంకితభావం, సేవా దృక్పథంతో మెలగాలి
● డాక్టర్స్ డే వేడుకలో కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ప్రజారోగ్యమే ధ్యేయంగా అంకిత భావంతో వైద్య సేవలందజేయాలని, రోగుల పట్ల సేవా దృక్పథంతో మెలగాలని కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్యులందరికీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవంలో ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ కృష్ణారావు తదితర వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వైద్యుని పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని, ఆవశ్యకమైనదని, ప్రజారోగ్య శ్రేయస్సుకు వైద్యులందరూ కృషి చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి సామాజిక ప్రగతికి దోహదపడతాయని ఆమె అన్నారు. జిల్లాలో గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల ఆవశ్యకత చాలా ఉందని, ఇప్పటికే చాలామంది వైద్యులు కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. సమాజంలో తమ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా వైద్య సేవలందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జ్యోతి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రశాంతి, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.