
పంట భూములను ఖాళీగా ఉంచొద్దు
కశింకోట: పంట భూములను ఖాళీ ఉంచకుండా ఏదో పంట వేసి పచ్చగా ఉంచడానికి రైతులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సిహెచ్.లచ్చన్న కోరారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలంకొత్తూరులో ఉన్న మండల మెగా ప్రకృతి వనరుల కేంద్రం వద్ద మూడో విడత నవ ధాన్యాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట భూములను పంటలు వేయకుండా వృథాగా ఉంచరాదన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు విత్తనాలను రైతుల నుంచి సేకరించి పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది పండించిన నవ ధాన్య పంటల విత్తనాలను కూడా స్థానిక రైతుల నుంచి సేకరించి వచ్చే ఏడాది రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నవ ధాన్యాలను సకాలంలో నాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సమర్ధంగా చేస్తున్న కూండ్రపు నూకాలమ్మను ఉత్తమ రైతుగా ఎంపిక చేసి దుశ్శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. సర్పంచ్ వాసు, ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకురాలు అరుణ, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వీహెచ్‌ఎ కిషోర్ పాల్గొన్నారు.