
అవిశ్వాస తీర్మానంపై సమావేశం మినిట్స్ ఇవ్వండి
మహారాణిపేట (విశాఖ): జీవీఎంసీ ప్రత్యేక సమావేశం మినిట్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఇన్‌చార్జి రవిరెడ్డి కోరారు. గత నెల 19న జరిగిన ఈ సమావేశం ప్రక్రియల మినిట్స్, వాటి ప్రతిని వెంటనే అందించాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న తాను రాసిన లేఖకు ఈ వినతి అనుసంధానంగా ఇస్తున్నట్లు తైనాల విజయకుమార్ పేర్కొన్నారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై చర్చించిన సమావేశం వివరాలు, చేపట్టిన చర్యల మినిట్స్ కాపీని అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియమిత పార్టీ విప్‌గా, తాను కోరిన పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాలన్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు.
కలెక్టర్‌కు తైనాల, రవిరెడ్డి వినతి