మామిడి పండ్లను సంప్రదాయ విధానంలో మగ్గబెట్టాలి
● జేసీ జాహ్నవి
తుమ్మపాల: సంప్రదాయ, సురక్షిత విధానంలో మగ్గబెట్టిన మామిడి పండ్లను మాత్రమే విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి ఆదేశించారు. జిల్లాలో 12,500 మంది రైతులు 20 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారని, సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల పంటను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఉద్యానశాఖ అధికారులు పండ్లను మగ్గబెట్టే సురక్షిత విధానాలపై రైతులకు, వ్యాపారులకు తెలియజేయాలన్నారు. సబ్బవరం మండలం పినగాడి వద్ద గల రయిపనింగు చాంబర్లను వినియోగించుకునే విధంగా ప్రచారం చేయాలన్నారు. మానవులకు హాని కలిగించే కాల్షియమ్ కార్బైడ్ ఉపయోగించి పండ్లు మగ్గబెట్టే విధానాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని, వ్యాపారులకు కార్బైడ్ వినియోగిస్తే తీసుకునే చర్యల గురించి తెలియజేయాలని తెలిపారు. ఆహార భద్రతా శాఖ సిబ్బంది అధికంగా శాంపిల్స్ సేకరించాలని, కార్బైడ్ వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయాలన్నారు. జిల్లా పంచాయతీ శాఖ, మునిసిపల్ సిబ్బంది ఇందులో పాలు పంచుకోవాలని, రవాణాశాఖ సిబ్బంది మామిడి పండ్ల రవాణా వాహనాలను తనిఖీ చేయాలన్నారు. నర్సీపట్నం, పాయకరావుపేట మార్కెట్ యార్డులు, విశాఖపట్నం రైతుబజార్లలో గల రయిపెనింగు చాంబర్లను వెంటనే వినియోగంలోనికి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆమె ఆదేశించారు.


