
● కలెక్టర్ రవిపట్టాన్‌శెట్టి
తుమ్మపాల : కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు పండగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రవిపట్టాన్‌శెట్టి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న కార్యక్రమాలకు సంబంధించి నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేయాలన్నారు. సీఎం హామీ మేరకు మొదటి అంశంగా అవ్వాతాతలు, వితంతువులతో పాటు చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ బాధితులకు జనవరి 1 నుంచి పెంచిన రూ.3 వేల పెన్షన్‌న్ కానుకను అందజేయనున్నట్లు తెలిపారు. రెండవ అంశంగా జనవరి 19న రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పాలనలో చేపట్టిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా విజయవాడలో నిర్మించిన 125 అడుగుల ఎత్తయిన బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని జనవరి 19న సీఎం జగన్ ఆవిష్కరించనున్నారన్నారు. అదే విగ్రహం ఫోటో ఫ్రేమ్‌లను అదేరోజున అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రతిష్టించి ఉత్సవాలు జరపలన్నారు. మూడో అంశంగా జనవరి 23న చివరి దఫా వైఎస్సార్ ఆసరా సొమ్ము విడుదల కార్యక్రమంపై రెండు విడతలుగా చేపట్టే ప్రచారం, నాల్గవ అంశంగా ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సహాయం పంపిణీ చేసే కార్యక్రమాలు, అదే విధంగా వలంటీర్లచే సంక్షేమ పథకాలపై లబ్ధిదారులచే రూపొందించిన బెస్ట్ టెస్టిమోనీ వీడియోలను అప్లోడ్ చేయించడం, జనవరి ఒకటి నుంచి రెండో ఫేజ్ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం నిర్వహణ వంటి అంశాలపై సీఎం సమీక్షించిన అంశాలను కలెక్టర్ అధికారులకు తెలిపారు. జేసీ ఎం.జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్, ఆర్డీవోలు జయరాం, చిన్నికృష్ణ, ఎస్‌డీసీ డాక్టర్ ఎ.మహేష్, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, సీపీవో జి.రామారావు పాల్గొన్నారు.