
రోడ్ల మరమ్మతులపై ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షిస్తున్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
చోడవరం: దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆదేశించారు. విశాఖపట్నం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చోడవరం నియోజకవర్గ పరిధిలో బీఎన్ రోడ్డుతో పాటు పలు రహదారులు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే బాగు చేయాలని కోరారు. బీఎన్ రోడ్డు ఆధునికీకరణకు నిధులు మంజూరైనా ఎందుకు పనులు చేపట్టడం లేదని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. వెంటనే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. దీనికి వారు స్పందిస్తూ రెండ్రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.