పాడేరు రూరల్: ఆదివాసీలను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామరావుదొర డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రా ప్రాంతంలోకి వలస వచ్చి ఎస్టీ బెంతు ఒరియాలుగా చెలామణి అవుతూ తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న విషయాన్ని చెప్పుకునేందుకు వెళ్లిన ఆదివాసీలను ‘ఆఫ్ నాలెడ్జీ ఫెలోస్, బ్లేడి బాస్టేట్స్’అంటూ అవమానకరంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే వలసవాదులైన ఇతరులు ఆంధ్రాలో చొరబడి నకిలీ ధ్రువపత్రాలతో ఎస్టీలుగా వివిధ ఉద్యోగాలు సాధించారని ఆరోపించారు. దీంతో నిజమైన ఎస్టీలకు మనుగడ లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికార అండ దండలతో 27 వేల మంది గిరిజనేతరులను ఎస్టీలో కూడా చేర్పించాలని ఎమ్మెల్యే అశోక్ ప్రయత్నం చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆదివాసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై తక్షణం అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమానికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ మీడియా విభాగం ప్రతినిధి బాబూజీ, తదితరులు పాల్గొన్నారు.


