దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశం
సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా ప్రదేశాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పకడ్బందీగా క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలు చోట్ల ఇంకా సిమెంట్ వర్క్‌లు జరుగుతుండటంతో ఎన్ని రోజులపాటు చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరమైన పనులు చేయకుండా, భక్తులకు ఉపయోగపడే పనులు చేయాలని ఆదేశించారు. దక్షిణ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు ఏర్పాటు చేసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంపై ఆరా తీశారు. రూ.1500, రూ.1000,రూ.300 క్యూల వద్ద భక్తులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సింహగిరిపై బస్ కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 10 నాటికల్లా అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని ఆదేశించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి తదితరులు పాల్గొన్నారు.


