పాడేరు : శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం పాడేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పాత పాడేరు వద్ద నిర్వహించిన వేడుకల్లో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తులకు అన్నదానం చేశారు. సుండ్రుపుట్టు రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ముంచంగిపుట్టు: మండలంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక రామాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మూర్తి దంపతలు, పలువురు దంపతులు కల్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో భారీగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు. సీతారాముల విగ్రహాలను డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలతో ఊరేగించారు. జోలాపుట్టు, బొండ్రుగూడ, దొడిపుట్టు, కిలగాడ, దార్రెల, పెదగూడ గ్రామాల్లో వేడుకలు, అన్నసమారాధన నిర్వహించారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
హుకుంపేట: ఆధ్యాత్మిక జీవనం మానవాళికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శుక్రవారం తన స్వగ్రామమైన కొంతిలిలో పర్యటించిన ఆయన, అక్కడ నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, భక్తి మార్గంలో నడవడం ద్వారా ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, స్థానిక సర్పంచ్ రేగం రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పాంగి అనిల్, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, హుకుంపేట సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరావు పాల్గొన్నారు.
జి.మాడుగుల: రెండవ భద్రాద్రిగా పేరొందిన జి.మాడుగుల రామకోవెలలో శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. విశాఖ వేద పండితులు గోపాలశాస్త్రి బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య 100 జంటలతో కలిసి ఈ వేడుకను నిర్వహించారు. మాజీ మంత్రి, ఆలయ ధర్మకర్త మత్స్యరాస బాలరాజు–రూపవతి దంపతులు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు,పద్మ, జెడ్పీటీసీ మత్స్యరాస వెంకటలక్ష్మి, సన్యాసినాయుడు దంపతులు ఈ కల్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, శాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, థింసా నృత్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు సాగింది. అనంతరం దేవుని గెడ్డ వద్ద అనుపు ఉత్సవం నిర్వహించారు. మండలంలోని జీఎం కొత్తూరు, వంజరి, బందవీధి, నుర్మతి, గెమ్మెలి తదితర గ్రామాల్లోనూ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, ఆర్గనైజర్ రామరాజు, సభ్యులు వెంకటరమణ, కొత్తందొర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు: మండలంలోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రపాలెం, కాకరపాడు, కొయ్యూరు, మంప, రేవళ్లు, ఆడాకుల, శరభన్నపాలెం, మర్రివాడ తదితర రామాలయాల్లో సీతారాముల కల్యాణం శాస్తోక్త్రంగా నిర్వహించారు. రాజేంద్రపాలెంలో నిర్వహించిన అన్నసమారాధనలో వైస్ ఎంపీపీ నూకాలు, సర్పంచ్ సింహాచలం, స్థానికులు పాల్గొన్నారు.
చింతపల్లి: మండలంలోని చౌడుపల్లి, పశువులుబంద, బయిలుకించంగి, గొందిపాకలు, బౌడ, తాజంగి, లంబసింగి, కొత్తపాలెం, అంజలిశనివారం తదితర గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా అన్నసమారాధనలు ఏర్పాటుచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీలేరు: స్థానిక శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వలస గెడ్డ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం చేపట్టారు. మహిళలు కోలాటం నిర్వహించారు. దుప్పులవాడ, దారకొండ గ్రామాల్లో స్వామివారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ముంచంగిపుట్టులో అన్నసమారాధనలో భక్తులు
వాడవాడలా ఘనంగా
శ్రీరామనవమి వేడుకలు
భారీగా తరలివచ్చిన భక్తజనం
మార్మోగిన రామనామం
భక్తిభావంతో పులకించిన మన్యం


