కొయ్యూరు: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ’వేద సంకల్ప సేవా ట్రస్ట్’ ఆధ్వర్యంలో పలు రామాలయాలకు ఆర్థిక సాయం అందజేశారు. కొయ్యూరు మండలంలోని రేవళ్లు, కాకరపాడు, శరభన్నపాలెం గ్రామాల్లోని రామాలయాలకు, అవసరమైన వస్తువుల కొనుగోలు నిమిత్తం ఒక్కో ఆలయానికి రూ. 10 వేలు చొప్పున విరాళం అందించారు. ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డీవీడీ ప్రసాద్, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతల్లి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గౌరి పార్వతి చేతుల మీదుగా ఈ సాయాన్ని అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదా పు 63కు పైగా రామాలయాలకు వేద సంకల్ప ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కొయ్యూరు మండలంలోని మూడు ఆలయాలకు ఈ సాయం అందడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.


