అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం మండలంలో మైనింగ్‌ను ఏఎంఆర్ సంస్థలకు అప్పగించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ చెక్‌పోస్టులు వద్ద కార్మికులు 24 గంటలూ విధుల్లో ఉండడంతో అనారోగ్యానికి గురై మృత్యవాత పడుతున్నట్లు వాపోయారు. కార్మికుల చట్టాలను ఏఎంఆర్ సంస్థ నీరుగారుస్తుందన్నారు. మండలంలో మామిడిపాలెం ఏఎంఆర్ మైనింగ్ చెక్ పోస్ట్‌లో మొబైల్ స్క్వాడ్ విధుల్లో ఉండి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తాడేపల్లి గూడెంకు చెందిన ముప్పిడి రామిరెడ్డి కుటుంబానికి సదరు సంస్థ రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే ప్రమాదంలో క్షతగాత్రుడైన కూండం గ్రామానికి చెందిన జగదీష్‌కు పూర్తి వైద్యం అందించాలని కోరారు. మైనింగ్ చెక్ పోస్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రాణాలకు తెగించి రేయంబవళ్లు మైనింగ్ ప్రాంతాలను చెక్ చేయడంతోపాటు నిత్యం ప్రమాదాలు గురవుతున్న వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, పనిగంటలు అదనంగా చేయించుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. లేబర్ అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.


