రావికమతం : స్థానిక బీఎన్‌రోడ్డులో గురువారం ఎదురెదురుగా వస్తున్న బొలేరో, స్కూటీ వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మైనర్ యువకులు మృతి చెందారు. మరో మైనర్ గాయపడ్డాడు. ఈ దుర్ఘటనపై ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చేఽందిన డి.ఉదయ్‌కుమార్ (16), సిహెచ్.కోటేశ్వరరావు(17), ఐ.బాజ్జి(17) అనే ముగ్గురు గురువారం ఏపీ 39ఎఫ్‌డబ్ల్యు 4047 నంబర్ గల స్కూటీపై కొత్తకోట వైపు వెళుతుండగా అదే సమయంలో గర్నికం గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీను బొలేరో(ఏపీ39టీఎల్ 3332) వాహనంపై పాడేరు వెళుతుండగా ఎదురెదురుగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉదయ్‌కుమార్ (పండు), కోటేశ్వరరావుల తల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన ముగ్గురినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయ్‌కుమార్, కోటేశ్వరరావులకు తలపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయ్‌కుమార్ (పండు) మరణించగా, కోటేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి కోటేశ్వరరావు మృతి చెందాడు. మరో యువకుడు బాజ్జి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బొలేరో వాహనం డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు. ఇద్దరు మైనర్ యువకులు మృతి చెఽందడంతో రావికమతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


