పాడేరు : జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఐటీడీఎ పీవో, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఏటీడబ్ల్యూవోలు, హెచ్‌ఎలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి అందిన ప్రతికూల ఫీడ్ బ్యాక్‌కు గల కారణాలను నిశితంగా పరిశీలిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హెచ్‌ఎంలు జవాబుదారితనంలో విధులు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అభ్యసన వాతావరణం కల్పించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూఓలు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


