చిల్లిగవ్వే మిగిలేది! | - | Sakshi
Sakshi News home page

చిల్లిగవ్వే మిగిలేది!

Mar 26 2026 7:39 AM | Updated on Mar 26 2026 7:39 AM

చెమట చిందించినా..
వారపు సంతల్లో మద్దతు ధర లేక గిరి రైతు విలవిల

కొనసాగుతున్న దళారుల దోపిడీ

గిట్టుబాటు కాక నష్టాలు

ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాత

అడవిని నమ్ముకుని, ఆకాశమే హద్దుగా శ్రమిస్తూ.. రక్తాన్ని చెమటగా మార్చి ఆదివాసీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కరువైంది. వారపు సంతలే వేదికగా సాగుతున్న ఈ ధరల దోపిడీలో దళారులు లాభపడుతుంటే, గిరి రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బయట మార్కెట్‌లో ధరల

మంట.. సంతలో మాత్రం గిరిజన పంటల ధరలు పతనం.. ఈ వైరుధ్యాల మధ్య ఆదివాసీ రైతులు విలవిల్లాడుతున్నారు.

జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిలకడగా లేకపోవడంతో ఆదివాసీ రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత రైతులు ప్రధానంగా పసుపు, మిరియాలు, పిప్పలి, అల్లం, కాఫీ వంటి వాణిజ్య పంటలను ఎంతో కష్టపడి పండిస్తున్నారు. అయితే, తాము పండించిన పంటను విక్రయించుకోవడానికి వీరికి స్థానిక వారపు సంతలే ప్రధాన దిక్కవుతున్నాయి.

రైతుల ఆవేదన

సీజన్‌ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్న ధరలు, గత మూడు వారాలుగా క్రమంగా పడిపోతుండటం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జి.మాడుగుల సంతబయలు మంగళవారం, మద్దిగరువులో గురువారం జరిగే సంతల్లో ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

ధరల వ్యత్యాసమిలా..

మిరియాలు: కిలో రూ. 670 నుంచి రూ. 640, పసుపు: కిలో రూ. 140 నుంచి రూ. 120, పిప్పలి మోడి: కిలో రూ. 300 నుంచి రూ. 260కు తగ్గింది. పాచ్‌మెంట్‌ కాఫీ: కిలో రూ. 510 నుంచి రూ. రూ.425కు, కాఫీ గుల్లరకం రూ.270 నుంచి రూ.230కు పతనమైంది. మొత్తంగా కిలోకు రూ. 20 నుంచి రూ. 50 వరకు ధరలు తగ్గడంతో గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతోంది.

మోసపోతున్న వైనం

మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొండ కోనల నుంచి ఎంతో శ్రమటోడ్చి పంటను సంతకు తీసుకొచ్చిన రైతులు, తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, రవాణా ఖర్చుల భారంతో నష్టానికై నా వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. బయట మార్కెట్‌లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, మేము పండించిన పంటలకు మాత్రం ధరలు పడిపోతున్నాయి అని ఆదివాసీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికార యంత్రాంగం

వారపు సంతల్లో వాణిజ్య పంటల ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని, తద్వారా దళారుల దోపిడీ నుంచి తమను రక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొనుగోలుకు వెనుకాడుతున్నాం

మార్కెట్‌లో వాణిజ్య, వ్యవసాయ పంటలు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల వారపుసంతలో ధరలు తగ్గడంతో రైతులకు కొంత వరకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. గత మూడు వారాల నుంచి ఉత్పత్తుల ధర కిలో రూ. 20 నుంచి 50వరకు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నాం. తెగించి కొనుగోలు చేస్తే నష్ట పోవాల్సి ఉంటుంది. – శ్రీనివాస్‌,

వ్యాపారి, మాడుగుల

ధరలు నిలకడగా లేక నష్టం

ఏజెన్సీ ప్రాంతంలోని వారపుసంతల్లో పసుపు, పిప్పలి, కాఫీ, మిరియాలు వంటి వాణిజ్య, వ్యవసాయ పంటలకు ధరలు నిలకడగా ఉండటం లేదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. వారపుసంతల్లో ధరలు రానురాను పెరుగుతాయని భావించి నిల్వ చేసుకున్న పంటలు ధరలు తగ్గుముఖం పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో అమ్ముకోవాల్సి వస్తోంది.

– నాయుడు, పసుపు రైతు,

పెదలోచలి, జి.మాడుగుల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement