అభివృద్ధి పనులకు వెంటనే అనుమతులు మంజూరు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు వెంటనే అనుమతులు మంజూరు

Mar 26 2026 7:39 AM | Updated on Mar 26 2026 7:39 AM

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

పాడేరు: జిల్లా సమగ్రాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిచ్చే రహదారులు, సెల్‌ టవర్ల నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణానికి తీసుకునే అటవీ భూములకు బదులుగా, రెవెన్యూ భూములను ప్రత్యామ్నాయంగా చూపించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలకు లోబడే అభివృద్ధి పనులు జరగాలన్నారు. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ లేదా ప్రైవేటు భూములకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రతినిధులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి నూకరాజు, రంపచోడవరం ఆర్‌డీవో అంబేడ్కర్‌, పాడేరు, చింతపల్లి డీఎఫ్‌వోలు ఉమామహేశ్వరి, నర్సింగరావు పాల్గొన్నారు.

జనగణనపై ముగిసిన శిక్షణ

జనగణన–2027పై ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు స్థానిక కలెక్టరేట్‌లో గత మూడు రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడారు. దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లాలోని 11 మండలాల నుంచి శిక్షణ పొందిన 22 మంది ఉపాధ్యాయులకు ధ్రువీకరణ పత్రాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్‌, జనగణన సెన్సెస్‌ అధికారి త్రినాథరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement