జేఏసీ నేతలు డిమాండ్
సీలేరు: ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో సీలేరును నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని కోరుతూ స్థానిక జేఏసీ నాయకులు బుధవారం జెన్‌కో అధికారులతో చర్చలు జరిపారు. జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు, ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, డీఈ బాలకృష్ణ, సర్పంచ్ దుర్జో, జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. తొలివిడతగా పార్వతీ నగర్, సాండ్ కోరి, బూసుకొండ గ్రామాల్లో ప్యాకేజీ అమలు చేశాక, సీలేరు యువతకు మెగా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఈ హామీ ఇచ్చారు. సీలేరును పూర్తిస్థాయి నిర్వాసిత గ్రామంగా అధికారికంగా ప్రకటించాలని, అప్పటి వరకు పనులు ప్రారంభించవద్దని నాయకులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల దెబ్బతినే ప్రస్తుత స్మశాన వాటికకు బదులుగా, అన్ని సదుపాయాలతో వేరే చోట కొత్తది నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామంగా సీలేరును చేర్చే అంశాన్ని ఎండీ దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే, డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాంబమూర్తి, ఉప సర్పంచ్ వల్లి ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ కార్య శ్రీనివాస్, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


