జి.మాడుగుల: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని కోరుతూ మండలంలోని పెదలోచలి, గొడుగుమామిడి, వంతాల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బుధవారం ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ఈ యాత్ర నేటితో 136వ రోజుకు చేరుకుంది. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో, సొలభం సర్పంచ్ ఐసరం హనుమంతరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామన్నదొర ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఉద్యోగాలను స్థానిక గిరిజనులకే కేటాయించేలా వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని, కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడానికంటే ముందే ఈ నియామక చట్టం ప్రక్రియను పూర్తి చేసి, ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా, వచ్చేనెల 3న (శుక్రవారం) పాడేరులో నిర్వహించబోయే భారీ బహిరంగ ర్యాలీకి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, జెఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరింది.


