● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
హుకుంపేట: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. బుధవారం మండలంలోని సంతరి గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో జగనన్న హయాంలో నిర్మించిన సచివాలయ భవనాలు ‘గ్రామ స్వరాజ్యానికి’ నిలువెత్తు సాక్ష్యాలని, ఇవి ప్రజల గుండెల్లో చెరగని గుర్తుగా మిగిలిపోతాయని కొనియాడారు. ప్రస్తుత కూటమి పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక పంచాయతీ భవనాలకు మోక్షం కలగలేదని, నేటికీ అవి మొండిగోడలతోనే దర్శనమిస్తున్నాయని విమర్శించారు. నిజమైన నాయకుడంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా ఉండాలని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కడం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పాంగి అనిల్, వైస్ ఎంపీపీ గంజాయి సుశీల, సర్పంచ్‌లు కాసులమ్మ, వెంకట పూర్ణిమ, నాయకులు సంజీవ్, కామేష్, నాగేష్ పాల్గొన్నారు.


