డుంబ్రిగుడ: మండలంలో గిరిజనుల సాంప్రదాయ ఇటుకల పండగ సంబరాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అరకు – పాడేరు జాతీయ రహదారితో పాటు పలు గ్రామాల రోడ్లపై గిరిజన మహిళలు గేట్లు ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి పజోర్లు (చందాలు) వసూలు చేస్తూ సందడి చేశారు. ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండుగలో పజోర్ల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని గ్రామంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ వారం రోజుల పాటు గిరిజనులు ఎటువంటి పనులకు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉంటారు. ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ, ఊయలలు కట్టుకుని మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా గడుపుతారు.ఈ పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వేటకు వెళ్తారు. పండుగ ముగింపు రోజున గుడ్డును కొట్టడం లేదా ఏదైనా జంతువును వేటాడటం ద్వారా ఉత్సవాన్ని ముగిస్తారు.


