సామాన్య భక్తులకే పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకే పెద్దపీట

Mar 25 2026 7:11 AM | Updated on Mar 25 2026 7:11 AM

● ఏప్రిల్‌ 17 నాటికి చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి కావాలి ● మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

మహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ సింహాచలం చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్‌ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్‌ 17వ తేదీ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, ఈ లోగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు.

పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారి కోసం మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి

దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. టికెట్ల అమ్మకం సమయం, ఆన్‌లైన్‌ లభ్యత, విక్రయ కేంద్రాల వివరాలను ముందుగానే భక్తులకు తెలియజేయాలన్నారు. నకిలీ టికెట్లు రాకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసే యంత్రాలను సిద్ధం చేసుకోవాలని, ఎండ లేదా వాన కురిసినా భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్లు నిర్మించాలని కోరారు.

భద్రతపై ప్రత్యేక నిఘా

భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తప్పిపోకుండా చైల్డ్‌ ట్యాగింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్‌ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్‌ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement