అనకాపల్లి: సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ విమర్శించారు. మంగళవారం స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు వంటి వాటిపై ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ తన బాధ్యతలకు రాజీనామా చేసి ఏడాదిన్నర కావస్తున్నా నూతన చైర్మన్‌ను నియమించకుండా తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లిస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లను మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదన్నారు. వీటిని ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీఏలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో గగ్గోలు పెట్టిన కూటమి పెద్దలు ఇప్పుడు నాలుగు డీఏలను చెల్లించకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే ఇక పోరాటం తప్పదన్నారు. కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లోనూ అదే నెల 15 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర రాజధానిలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 28వ తేదీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చి ముట్టడిస్తామన్నారు. అంతకుముందు ఏపీ ఎన్‌జీవోఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీలా రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి. శేషుకుమార్, ఖజానా శాఖ సంఘ నాయకులు డి. ఆనంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుత్తుల సూర్యప్రకాష్, వైరాల రమేష్ రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ బైలపూడి దేముడునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.


