సాక్షి, విశాఖపట్నం : ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందితో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి సంసిద్ధంగా ఉండాలని విశాఖ పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ కె.రోష్ని అపరంజి సూచించారు. 55వ జాతీయ భద్రతా దినోత్సవం–డాక్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు వేడుకలు పోర్టు అథారిటీ పరిపాలన భవనంలోని శ్రీ సాంబమూర్తి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించిన ఈ వారోత్సవాల్లో భాగంగా భద్రతపై అవగాహన, అత్యవసర పరిస్థితుల ఎదుర్కొనే సంసిద్ధతపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పోర్టు చైర్మన్ డా. అంగముత్తు హాజరుకాగా.. సేఫ్టీ కమిటీ చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ డాక్ సేఫ్టీ ట్రైనింగ్ పోస్టర్‌ని ఆవిష్కరించారు. చీఫ్ విజిలెన్స్ అధికారి టి.అరుణ్ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ ఎం.శంకర్‌బాబు, సీఎంఈ రామ్‌ప్రసాద్‌తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, టెర్మినల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టు కార్యకలాపాల్లో ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు అందరూ తమ సంసిద్ధతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు.


