టమాటా రైతు కన్నీరు | - | Sakshi
Sakshi News home page

టమాటా రైతు కన్నీరు

Mar 24 2026 7:51 AM | Updated on Mar 24 2026 7:51 AM

● పొలంలోనే వదిలేస్తున్న పంట ● ధరలు పతనంతో గగ్గోలు

గొలుగొండ: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా టమాటా రైతుల పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర పతనం కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్న తరుణంలో అకాల వర్షాలు ఉన్న పంటను దెబ్బతీశాయి. దాంతో రైతు వద్ద కిలో రెండు రూపాయల ధర లేకపోవడంతో వీటిని సేకరించకుండా పొలంలోనే వదిలేస్తున్నారు.

300 ఎకరాల్లో సాగు

గొలుగొండ మండలంలో లింగంపేట, జోగుంపేట, గొలుగొండ, సాలికమల్లవరం, ఏఎల్‌పురం ప్రాంతాల్లో 300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ నెలలోనూ ధరలు పతనం కావడం ఇదే తొలిసారిగా రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడలు పెడితే కనీసం ఇప్పుడున్న ధరలు ప్రకారం రూ.5 వేలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలంలో కాయలు

మార్కెట్‌లో 30 కేజీల టమాటా రూ.60కు ధర రావడంతో కనీసం టమాటా ఏరే కూలీల ఖర్చు రావడం లేదని వాపోతున్నారు. దీంతో కష్టపడి సేకరించి మార్కెట్‌కు తరలించే ప్రయత్నంలో రైతులు విసిగివేసారి కాయలు ఏరకుండానే పొలంలో వదిలేస్తున్నారు. కనీసం వీటి ధరలు పెరుగుతాయని ఆశ కూడా లేదని చెబుతున్నారు. కోసిన కాయలకు ధరలు లేకపోవడంతో కొన్ని చోట్ల పొలం వద్దే పారేస్తున్నారు.

మూడు రోజుల నుంచి అకాల వర్షాలు

ధరలు లేవని ఆందోళన చెందుతున్న రైతులు అకాల వర్షాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మూడు రోజులుగా వర్షాలు కురవడంతో కాయలకు మచ్చలు రావడంతోపాటు టమాటా పంట కుళ్లిపోయి చనిపోతోందని వాపోతున్నారు. ఒక వైపు ధరలు లేకపోగా, మరోవైపు వర్షాలు పంట నష్టం వాటిల్లిందని తీవ్ర ఆవేదన చెందున్నారు. ఇంత కష్టంలో కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఎంతో కొంతమేలు జరిగేదని చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

టమాటా గిట్టుబాటు లేక...

మాడుగుల : టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మాడుగుల వారపు సంతకు శంకరం, తాటిపర్తి తదితర గ్రామాలు నుంచి రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకు వచ్చారు. కనీసం కిలో రూ.4 కూడా ధర రాలేదు. దీంతో కొంత మంది రైతులు సంతలో టమాటాలు వదిలి వెళ్లిపోయారు.మూడు నెలలు క్రితం కిలో రూ.50 నుంచి రూ.70 వరకు ధరలు పలికేవి. ప్రస్తుతం ధరలు కుదేలు అవడంతో టమాటా రైతులు కనీసం కూలి అయినా గిట్టుబాటు లేదని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement