నర్సీపట్నం: ఆర్టీసీ ప్రయాణికులకు 2014 టీడీపీ పాలన నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నక్కపల్లిలో సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేసి, సభకు జనాలను తరించేందుకు మళ్లించారు. డిపోకు చెందిన వంద బస్సుల్లో సగానికి పైగా సీఎం సభకు మళ్లించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలను చేరేందుకు నానా ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు రావని ఆర్టీసీ సిబ్బంది మైక్‌లో చెప్పినప్పటికీ వస్తాయనే ఆశతో కాంప్లెక్స్‌లో ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షణ చేశారు. విజయవాడ, రాజమండ్రి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు వరుసగా సెలవులు రావడంతో ఇంటికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు నరకం చూశారు. తల్లిదండ్రులు ప్రైవేటు వాహనాలను పెట్టి కాలేజీలకు పంపించారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. కూలీ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు కాంప్లెక్స్‌లో దిగారు. బస్సులు లేకపోవడంతో మూటలు మోసుకుని ఆటోల కోసం మెయిన్ రోడ్డుపైకి వచ్చి నిరీక్షణ చేశారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రావడంతో సామాన్య ప్రజలు బస్సులు కోసం పడరాని పాట్లు పడ్డారు.


