ఒకప్పుడు పచ్చని చెట్లతో, ఏడాదంతా కురిసే చిరుజల్లులతో, ప్రకృతి ఒడిలో పరవశించే జిల్లా.. ఇప్పుడు భూతాపం గుప్పిట్లో చిక్కుకుంది. మంచు దుప్పటి కప్పుకోవాల్సిన కొండలు, మంటల వేడికి సెగలు గక్కుతున్నాయి. అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, కాంక్రీట్ రహదారుల విస్తరణ మన్యం పచ్చదనాన్ని మాయం చేస్తున్నాయి. అటవీ విస్తీర్ణం అడుగంటుతుండటంతో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. వెరసి, అల్లం, పసుపు, కాఫీ వంటి ప్రధాన పంటలు ప్రమాదంలో పడ్డాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మన్యం తన సహజ స్వభావాన్ని కోల్పోతోంది. అడవులను కాపాడుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ముప్పు తప్పదని అటవీ శాఖ హెచ్చరిస్తోంది.
అడవి పెరగాల్సిన చోట, గడిచిన కొన్నేళ్లలో జిల్లాలో 101 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. పోడు వ్యవసాయం, రహదారుల విస్తరణ, వేసవిలో అడవి మంటలు మన్యం పచ్చదనాన్ని హరిస్తున్నాయి. మన్యం తన పచ్చని పట్టువస్త్రాన్ని కోల్పోకముందే మేల్కొనాలి.
నిప్పుల కొలిమిగా మారుతున్న చల్లని కోన
చెట్లు పిలిస్తే వచ్చేది, మనిషి పిలిస్తే రానిది వర్షం ఒక్కటే. అడవుల శాతం పెరగాల్సింది పోయి తగ్గిపోతుండటం ఆందోళనకరం. ప్రభుత్వం తక్షణమే అడవుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే, మన్యం తన సహజ సిద్ధమైన శీతల స్వభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
కొయ్యూరు: జిల్లాపై భూతాపం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు చల్లగా ఉండే మన్యం ప్రాంతం ఇప్పుడు వేడెక్కుతోంది.
అడవుల క్షీణత.. ప్రధాన కారణాలు
భారత అటవీ సర్వే అంచనా ప్రకారం, జిల్లాలో 101 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణాలివే..
పోడు వ్యవసాయం: అడవులను నరికి సాగు భూములుగా మార్చడం.
అభివృద్ధి పనులు: రహదారుల విస్తరణ కోసం పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించడం.
అడవి మంటలు: వేసవి కాలంలో అడవులు తగలబడటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
వర్షపాతంలో మార్పులు.. నేల కోత
జిల్లా సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి కొండలు 25 నుంచి 40 డిగ్రీల ఏటవాలుగా ఉంటాయి.
నీటి నిల్వ సామర్థ్యం: గతంలో ఏడాదికి సగటున 200 రోజుల పాటు వర్షాలు కురిసేవి. ఇప్పుడు వర్షపు రోజుల సంఖ్య 40–45 రోజులు తగ్గిపోయింది.
తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షపాతం సుమారు 1100 మిల్లీమీటర్లు నమోదవుతోంది. దీనివల్ల ఏటవాలు ప్రాంతాల నుంచి నీటితో పాటు భూమిలోని విలువైన లవణాలు, పోషకాలు కొట్టుకుపోతున్నాయి.
వ్యవసాయంపై ప్రభావం..
మారుతున్న వర్షపాత విలువల వల్ల పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
అల్లం, పసుపు: ముందస్తు వర్షాలు తగ్గడం, కురిసినప్పుడు అతిగా కురవడం వల్ల ఈ పంటలు దెబ్బతింటున్నాయి.
కాఫీ తోటలు: భవిష్యత్తులో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కాఫీ సాగుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
తుపాను ప్రభావం.. ప్రస్తుతం కేవలం తుపాన్ల సమయంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది క్రమబద్ధమైన సాగుకు ఏమాత్రం అనుకూలం కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం
మారుతున్న వాతావరణ పరిస్థితులు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పడిపోతున్న వర్షపాతం
భూతాపంతో వేడెక్కుతున్న జిల్లా
అడవులను పరిరక్షిస్తేనే క్షేమంఅంటున్న అటవీశాఖ అధికారులు
చెట్లు లేని చోట మేఘాలు ఆగవు.. మేఘాలు ఆగని చోట వానలు పడవు. ఏడాదిలో సగటున 200 రోజుల పాటు చిరుజల్లులతో వర్షాలు పలకరించేవి. ఇప్పుడు వర్షం కురిసే రోజుల సంఖ్య 40 నుంచి 45 రోజులకు పడిపోయింది. కురిసినా.. తక్కువ సమయంలోనే అతి భారీ వర్షం కురుస్తోంది.
అడవులు నరకడం వల్ల వర్షం పడినప్పుడు నీటిని ఆపే శక్తి నేలకు లేకుండా పోతోంది.వర్షపు నీటితో పాటు భూమిలోని విలువైన ఖనిజాలు, పోషక లవణాలు కొట్టుకుపోయి నేల నిస్సారమవుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతున్నాయి.
పోడు వ్యవసాయం కోసం బూడిదవుతున్న అటవీ ప్రాంతం
మోడువారిన చెట్టు
జాతీయ రహదారి నిర్మాణంలో
నరికివేతకు గురైన మారుజాతి చెట్ల కలప


