పేద కుటుంబాన్ని దహించిన
అగ్ని ప్రమాదం
ఒక పక్క కుటుంబ యజమానికి
అనారోగ్యం
మరోపక్క విధి ప్రకోపం
ఉన్న తాటాకిల్లు కాస్తా బుగ్గి
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
సాయం కోసం ఎదురుచూపు
కట్టబట్టలతో మిగిలిన బాధిత కుటుంబం, రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తున్న ఎస్‌ఐ కిషోర్‌వర్మ
కొయ్యూరు: విధి ఆ కుటుంబాన్ని ఇప్పటికే అనారోగ్యంతో పరీక్షిస్తోంది. వారానికి మూడు సార్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని డయాలసిస్ కోసం ఆస్పత్రి గడప తొక్కే ఆ గృహయజమానికి, ఇప్పుడు అగ్నిప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్న ఒక్క ఆసరా... ఆ చిన్న తాటాకిల్లు కాస్తా కళ్లముందే బూడిదవ్వడంతో, ఆ కుటుంబం ఇప్పుడు ఆకాశమే పైకప్పుగా మిగిలిపోయింది.
ప్రాణభయం మధ్య ఆ రాత్రి...
సింగవరం గ్రామానికి చెందిన పాము రాజు కుటుంబం శనివారం రాత్రి గాఢ నిద్రలో ఉండగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లంతా వ్యాపించిన మంటల నుంచి భార్యను, ఇద్దరు చిన్నారులను రాజు ప్రాణాలకు తెగించి బయటకు తీసుకువచ్చారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెను ప్రమాదం సంభవించినా, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. కానీ, ఆ ఇంట్లో దాచుకున్న కొద్దిపాటి నగదు, నిత్యావసర వస్తువులు, చివరకు పిల్లల సర్టిఫికెట్లు కూడా మంటలకు ఆహుతయ్యాయి.
నిలువనీడలేక దీనస్థితి
పాము రాజు కిడ్నీ వ్యాధితో పోరాడుతున్నారు. బతకడం కోసం వారానికి మూడు రోజులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. చికిత్సకు సంబంధించిన కీలక పత్రాలు కూడా కాలిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు నిలువ నీడ లేని పరిస్థితి.. మా బతుకులు తెగిన గాలిపటాలయ్యాయి.. అంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అండగా నిలిచిన మానవత్వం
బాధిత కుటుంబాన్ని చూసి చలించిపోయిన ఎస్‌ఐ కిషోర్‌వర్మ తక్షణమే స్పందించారు. స్వయంగా వెళ్లి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా, తన వంతుగా రూ.10 వేల నగదు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే స్థానిక నేత ఎంవీఎస్ ప్రసాద్ రూ.5 వేల నగదు, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిబోయిన చిన్న, గోవింద్, రాజు తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి అండగా నిలిచారు.కట్టుబట్టలతో మిగిలిన ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.


