చింతపల్లి: స్థానిక వంద పడకల ఏరియా ఆస్పత్రిలో ఎక్స్‌రే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే సేవలు కేవలం ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
అత్యవసర సమయంలో అగచాట్లు
ఎముకల వ్యాధిగ్రస్తులకు లేదా అత్యవసర కేసుల్లో వైద్యులు ఎక్స్‌రే తీయాలని సూచించినా, సాయంత్రం 4 గంటల తరువాత సిబ్బంది లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోతున్నాయి. ఒకవేళ పరిస్థితి మరీ విషమంగా ఉంటే, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఇతర సిబ్బంది తమకున్న కొద్దిపాటి అనుభవంతో ఎక్స్‌రే తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఆదివారం వంటి సెలవు దినాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఎక్స్‌రే తీసే వారు ఎవరూ లేకపోవడంతో, బాధితులకు ఏ అవయవానికి దెబ్బ తగిలిందో గుర్తించడం వైద్యులకు కూడా కష్టతరమవుతోంది.
వైద్యులు ఉన్నా.. వసతులు సున్నా : తాజాగా ఆదివారం నాడు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ తేజ నారాయణ విధుల్లో ఉండి, పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. అయితే, మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన ఎక్స్‌రే తీసే సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. అటు మైదాన ప్రాంతాలకు వెళ్లలేక, ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్స్‌రే తీయించుకునే ఆర్థిక స్థోమత లేక పేద రోగులు సతమతమవుతున్నారు. ఆస్పత్రిలో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా, అన్ని వేళల్లో ఎక్స్‌రే సేవలు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
సమయపాలన లేక రోగుల అవస్థలు


