● కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
● ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొట్టడంతో మృతి
గూడెంకొత్తవీధి: ఆ చిన్నారి పేరు వంతల లోకేష్.. వయసు కేవలం మూడేళ్లు. రేపటి గురించి తెలి యని ఆ పసివాడు, తన ఇంటి ముంగిట ఆడుకుంటూ గలగలా నవ్వుతున్నాడు. కానీ, విధి వెనుక నుంచి మృత్యువు రూపంలో దూసుకొస్తుందని ఆ చిన్నారి గానీ, ఆ కన్నవారు గానీ ఊహించలేదు. ఒక చిన్న నిద్రమత్తు ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. రింతాడ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెదవలసకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రసాద్, తన బంధువుల వివాహ విందుకు హాజరై కారులో తిరిగి వస్తున్నారు. అయితే, ప్రయాణంలో ఒక్క క్షణం ఆవరించిన నిద్రమత్తు కారు అదుపు తప్పేలా చేసింది. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా రహదారి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకువెళ్లింది. దురదృష్టవశాత్తూ, సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారి లోకేష్‌ను బలంగా ఢీకొట్టింది.
ఆస్పత్రికి వెళ్లేలోపే ఆగిన శ్వాస: తీవ్రంగా గాయపడిన లోకేష్‌ను కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ పసివాడి ప్రాణాలు అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వైద్యులు లోకేష్ మరణించినట్లు ధ్రువీకరించడంతో, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కళ్లముందే ఆడుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ సురేష్ పూర్తి వివరాలను సేకరించారు. కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ అనర్థం జరిగిందని ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేశారు.


