సీలేరు: గ్రామ దేవత, భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మారెమ్మ అమ్మవారి 54వ జాతర ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. ఈ సమావేశం ఆలయ కమిటీ అధ్యక్షుడు జైపాల్, గౌరవ అధ్యక్షుడు టక్కరి బుట్టి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. తమిళ సంప్రదాయం ప్రకారం, తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా శ్రీ మారెమ్మ అమ్మవారి జెండా ఆవిష్కరిస్తారు. 15వ తేదీ ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంత్రం అమ్మవారి గరగ అలంకరణ అగ్నిగుండం ప్రవేశం జరుగుతుంది. 16వ తేదీ నుంచి 23 వరకు ఆలయంలో ప్రతిరోజూ నిత్య పూజలు జరుగుతాయి. 24న ఆలయ ప్రాంగణంలో మహిళలతో భారీ ఎత్తున కుంకుమార్చన జరుగుతుంది. 25న అమ్మవారి గ్రామోత్సవం, 26న అమ్మవారి ప్రధాన పండగ, మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసమారాధన, 27న అమ్మ వారి చల్లనీటి ఉత్సవం, 29న అమ్మవారి మరు పూజ అనంతరం అన్నసంతర్పణ జరుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలన్నీ తమిళ క్యాలెండర్ ప్రకారం తమిళ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.


