ఎంవీపీకాలనీ : అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. శనివారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంవీఆర్‌తో పాటు మరో 100 మందికి పైగా ఆయని అనుచరులు శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వ్యాపారవేత్తగా ఎంవీఆర్‌కు మంచి గుర్తింపు ఉందని, ఆయన పార్టీలో చేరడం జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని ఈ సందర్భంగా మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన పాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా ఎంవీఆర్ , ఆయన అనుచరులు కృషిచేయాలని, పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని సూచించారు. ఎంవీఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంతో పాటు ఆయన ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితుడై బీజేపీలో చేరినట్టు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


