పాడేరు: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులు ప్రత్యేక చొరవతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి పలు సమస్యలపై 43 వినతులను, రెవెన్యూ క్లినిక్‌లో 9 వినతులను కలెక్టర్ దినేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్ఛార్జ్ డీఆర్వో అంబేద్కర్, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు కలిసి స్వీకరించారు. అర్జీదారుల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ప్రతి శుక్రవారం మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్ కచ్చితంగా నిర్వహించాలన్నారు మండల స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే, ఫిర్యాదుదారులతో అధికారులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజలు ’1100’ కాల్ సెంటర్ సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు. టీడబ్ల్యూ డీడీ పరిమళ, గృహ నిర్మాణ శాఖ పీడీ బాబు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్, డీఎల్పీవో కుమార్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్ బాబు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


