చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూనే ఉంది. దాంతో ప్రదాన రహదారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కొయ్యూరు: ఈ ప్రాంతంలో వరుసగా రెండో రోజూ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఐదు నిమిషాలు కురవడం, మరో ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వడం.. ఇలా విడతల వారీగా వర్షం కురుస్తూనే ఉంది.
రైతుల్లో ఆందోళన : నిత్యం వర్షాలు కురుస్తుండటంతో జీడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల జీడి తోటలు పూత దశ నుంచి పిందె దశకు మారినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత దశలోనే ఉన్నాయి. ప్రస్తుత మేఘావృత వాతావరణం, వర్షాల వల్ల పూత మాడిపోయే (నల్లబడే) ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.


