దేవరాపల్లి: పంటల సస్యరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి చెరకు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టరు ఉమామహేశ్వరరావు, డాక్టరు చంద్రశేఖర్ రైతులకు సూచించారు. మండలంలోని మారేపల్లి, తెనుగుపూడి, దేవరాపల్లి గ్రామాల్లో పంటలను ఏవో ఎల్.వై. కాంతమ్మతో కలిసి శుక్రవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. పూత దశలో నువ్వు పంటకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలమా..కాదా అని స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. వేరుశనగ, కార్షి దశలో ఉన్న చెరకు పంటను సైతం పరిశీలించారు. వేరుశనగ పంటలో మొక్కలు చనిపోవడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎక్సోకొనజోల్ 2 మిల్లీ లీటర్లను ఒక లీటరు నీటిలోను, ప్రొపి కొనజోల్ ఒక మిల్లీ లీటరను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు మొదలు భాగం తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సమగ్రంగా వివరించారు. మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎస్. కిరణ్‌కుమార్, స్థానిక అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


