పట్టుపరిశ్రమ యూనిట్లకు 90 శాతం రాయితీ
● ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు : పట్టుపరిశ్రమ యూనిట్లు ఏర్పాటుచేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీ కల్పిస్తున్నామని ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ వెల్లడించారు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో స్కిల్ సమగ్ర–2 పథకంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. పట్టుపరిశ్రమ ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా లబ్ధిపొందాలని ఆమె సూచించారు. జిల్లాలో 400 మంది రైతులు సుమారు 800 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారన్నారు. ఈ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది ఆసక్తి చూపేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇతర కులాల రైతులకు 75 శాతం రాయితీ అందజేస్తున్నామన్నారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో ఐదు యూనిట్లను, రోగ నిరోధక మందులు 156 యూనిట్లు, రేసింగ్ పరికరాలు 12 యూనిట్లను మల్బరీ రైతులకు పంపిణీ చేశారు. జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి కె.అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌బీఎస్ నందు తదితరులు పాల్గొన్నారు.
పట్టుపరిశ్రమ యూనిట్లకు 90 శాతం రాయితీ


