ీపీపీపీ విధానం రద్దు చేయాల్సిందే
● సీపీఐ నేతల డిమాండ్
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై
పాడేరు వైద్య కళాశాల ఎదుట ధర్నా
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్థతిలో ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట గురువారం బైఠాయించి ధర్నా చేశారు. పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంట సేపు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిగ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలుజేసి ప్రైవేటీకరణకు గాను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన 590,107,108 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాఽధి భద్రత, పేద, మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పది వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తే వైద్య విద్య వెనుక ఉన్న సామాజిక లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు. వైద్య విద్యకు అనుబంధమైన ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందే పేద ప్రజలు వైద్యసేవలకు దూరమవుతారని ఆయన వాపోయారు. ప్రభుత్వ రంగంలోని స్థిరమైన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు అందకుండా పోతాయన్నారు. పీపీపీ విధానం రద్దు, వైద్య విద్యను ప్రైవేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుకునే లక్ష్యంగా సీపీఐ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కూడా రాధాకృష్ణ, అమర్, పెట్ల పోతురాజు, సింహాచలం, ఉల్లి సూరిబాబు, దేవుళ్లు పాల్గొన్నారు.


