ఏపీఈపీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు
విశాఖ సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏపీఈపీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్– ది పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే నినాదంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025ను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో ఏపీఈపీడీసీఎల్ ప్రతిష్టాత్మక ‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జాతీయ అవార్డు’ ను సాధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్, పర్యావరణ–అటవీశాఖ మంత్రి శుభోద్ ఉనియల్, పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్‌ల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. ఏపీఈపీడీసీఎల్ తరఫున పీఆర్వో జి.ఎస్.ఎస్.ఎస్.వాసు ఈ అవార్డును అందుకుని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖల సహకారంతో ఈపీడీసీఎల్‌లో పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ద్వారా విద్యుత్‌ను అందించినట్లు వెల్లడించారు.


