ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం
పాడేరు : ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడంతో పాటు ఇంక్రిమెంట్లలో కోత విధించడం, రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులపై గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్భంధాలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్(యూటీ ఎఫ్) జిల్లా అద్యక్షుడు వి. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ప్రతినిధులు గురువారం ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లో జాబ్‌చార్ట్‌కు భిన్నంగా రాత్రంతా పాఠశాలల్లో మేల్కొని మరుసటి రోజు సాధారణ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం మానవ హక్కులను ఉల్లంఘించటమేనన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ వార్డెన్లను నియమించకుండా సబ్జెక్టు టీచర్లను డిప్యూటీ వార్డెన్ల భాద్యతలు అప్పగించడం సరికాదన్నారు. వసతి గృహాల్లో వాచ్‌మెన్లు, ఏఎన్‌ఎంలు లేక విద్యార్థుల కోసం ఉపాధ్యాయులను ఉంచడం, రాత్రిపూట పాఠశాలల్లో 9గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించి ఫోటో తీయాలని నిద్రపోయి మరలా రాత్రి 12 గంటలకు, ఉదయం 6గంటలకు పాఠశాలలో ఉన్నట్టు ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులను రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించమని చెప్పడం ఎంత వరకు సబబు అన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల రాత్రి బస కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. 2011సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు ధర్మారావు, దేముడు, కన్నయ్య, రఘునాఽథ్, నాగేశ్వరరావు, గంగాధర్, నారాయణ, ప్రసాద్, శ్యామ్, ధనుపతి, రాజారావు, శ్రవణ్, దుక్కు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


