సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర నాలుగో గురువారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం వెండి కవచాల అలంకారంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల పర్యవేక్షణలో ఆలయ ఈవో కె. శోభారాణి, ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు. భక్తుల సౌకర్యార్థం జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా టౌన్ కొత్తరోడ్డు వద్ద సుమారు 20 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు.
క్యూలైన్లలో భక్తులు
అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టౌన్‌కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ప్రారంభించగా, రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.20, రూ.100, రూ.200 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు రూ.500 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక దర్శన మార్గాలను కేటాయించారు. దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే దారిలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘోషాసుపత్రి, రీడింగ్ రూమ్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పించారు. ఆలయ సమీపంలోనే పోలీస్ అవుట్‌పోస్ట్, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. టౌన్‌కొత్తరోడ్డు, ఘోషాసుపత్రి ప్రాంతాల్లో చెప్పుల స్టాండ్‌లు ఏర్పాటు చేయగా, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు.శుక్రవారంతో ఈ మార్గశిర ఉత్సవాలు ముగియనున్నాయి.
క్యూలైన్ లో భక్తులు
సహస్ర ఘటాభిషేకానికి సిద్ధం చేసిన కళశాలు
సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు


