సైబర్ నేరాలపై అవగాహన
అరకులోయటౌన్: మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలను జిల్లా సైబర్ క్రైమ్ సీఐ వెంకటరమణ గురువారం సందర్శించారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ సైబర్ నేరాలకు దూరంగా ఉంటూ సైబర్ మోసాలపై మీ గ్రామాల్లో, మీ తల్లిదండ్రులకు ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, టెలిగ్రామ్, వాట్సప్‌లో టాస్క్ పేరిట జరిగే ఇన్వెస్టమెంట్ మోసాలతో జాగ్రత్త అవసరమన్నారు. ఇస్ర్ట్రాగామ్ ఫాల్ యూ టూబ్‌ల్లో లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపించి మోసాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక మొత్తంలో డబ్బులు పెట్టిన తరువాత మోసగాళ్లు మిమ్మల్లి బ్లాక్ చేస్తారన్నారు. ఆన్‌లైన్ లోన్ యాప్స్ వంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 1930కి ఫోన్ చేయాలని సూచించారు. అరకులోయ సీఐ ఎల్.హిమగిరి, కళాశాల ప్రిన్స్‌పాల్ సిస్టర్ బిందు, కరస్పాండెంట్ సిస్టర్ రూబి, సిబ్బంది శ్రీను, వెంకటరావు, కృష్ణారావు, లవకుశ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నకిలీ, కల్తీ వస్తువులపై అవగాహన అవసరం
జి.మాడుగుల: కల్తీ, నకిలీ వస్తువుల విక్రయాల్లో ,నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయని విద్యార్థులు అవగాహనతో వ్యవరించాలని వినియోగదారులు సంఘం సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కిముడ తెలిపారు.మండల కేంద్రంలో గల ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ వినయోగదారుల హక్కుల దినోత్సవం–2025 సందర్భంగా డిశంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పాఠశాల కన్స్యూమర్ క్లబ్ ఇన్‌ఛార్జీ కాంగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డిజిటల్ న్యాయం ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం అనే అంశంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పోటీలు నిర్వహణకు డీఈవో డాక్టర్ కె.రామకృష్ణారావు, అన్ని ప్రధానోపాధ్యాయులకు, కళాశాల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వు జారీ చేశారన్నారు. పోటీలకు పాఠశాల విద్యార్థులు ఎల్‌ఈఏపీ ప్లాట్‌ఫామ్, కళాశాల విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని పాల్గొనవలసినిదిగా ఆయన సూచించారు.


