బ్యాంక్ ఖాతాల్లో రూ.31.12 కోట్ల నిల్వలు
● కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడి
● ఎటువంటి లావాదేవీలో చేయని వారికోసం 19న ప్రత్యేక శిబిరం
పాడేరు : జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఎటువంటి లావాదేవీలు జరగకుండా 1,76,191 ఖాతాల్లో రూ.31.12 కోట్ల నిల్వలు ఉన్నాయని కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు. మీ డబ్బు– మీ హక్కు ప్రచార కార్యక్రమంలో భాగంగా సంబంధిత పోస్టర్లను మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. సంబంధిత ఖాతాదారులు తమ యొక్క సరైన ధ్రువీకరణ పత్రాలతో బ్యాంకులకు వచ్చి ఈకేవైసీ పూర్తి చేసి తమ సొమ్మును పొందాలని సూచించారు. ఈ విషయంపై ఈనెల 19న పాడేరు యూనియన్ బ్యాంకు వద్ద ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ మాతినాయుడు, పలు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


