ఆదివాసీలకు స్వయంపాలన అందించాలి
● దండకారణ్య ఉద్యోగ సమితి జాతీయ కార్యదర్శి మాణిక్యం
జి.మాడుగుల: భారత రాజ్యాంగం ప్రకారం 5, 6 షెడ్యూల్స్ అనుసరించి ఆయా ప్రాంతాల ఆదివాసీలను పరిపాలన దక్షకులుగా తయారు చేయాలని లేని పక్షంలో ఆ ప్రాంతాలను స్వయంపాలన పాలిత ప్రాంతాలుగా ప్రకటించి రాజ్యాధికారం అప్పగించాలని దండకారణ్య ఉద్యోగ సమితి జాతీయ కార్యదర్శి సమరెడ్డి మాణిక్యం డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాధికారం ఆదివాసులకే ఉండాలని భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ స్పష్టం చేస్తుందన్నారు. దేశానికి స్వాతంత్ర వచ్చి 80సంవత్సరాలు కాలమవుతున్నా ఆదివాసీలు ఎలాంటి అభివృద్దికి నోచుకోకుండా, తీవ్ర దోపిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ హక్కులు,చట్టాలు, భారత పాలకులు అమలు చేయటవలో భారత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఆదివాసీలకు స్వయంపాలన అధికారం అప్పగించాలని దండకారణ్య విమోచన సమితి సలహాదారులతోపాటు, దండకారణ్య ఉద్యోగ సమితి జాతీయ కార్యవర్గం డిమాండ్ చేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు ఉందన్నారు. 5వ భూభాగ ప్రాంతాన్ని స్వయం రాష్ట్రాలుగా ప్రకటించాలని ఏకై క డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న ఆదివాసీ రాజకీయ ప్రతినిధులు స్వయంపాలన ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేయాలని ఆయన కోరారు. స్వయంపాలన రాజ్యాధికారంతో కూడిన రాష్ట్రాలుగా ప్రకటించాలని ఉద్యమం ఉధృతం చేయాలని అన్ని సంఘాలకు ఆయన సూచించారు.


