అవినీతికి అడ్డాగా రైల్వే ఆసుపత్రి?
తాటిచెట్లపాలెం: వాల్తేర్ రైల్వే డివిజన్‌లో అవినీతి ఆరోపణలు మరోసారి కలకలం రేపుతున్నాయి. కొద్ది కాలం కిందట డీఆర్‌ఎం స్థాయి అధికారి సీబీఐకి చిక్కిన ఉదంతం మరవకముందే, ఇప్పుడు డివిజనల్ రైల్వే ఆసుపత్రి అవినీతికి కేంద్రంగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలోని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(సీఎంఎస్) కార్యాలయం కేంద్రంగా కొందరు ఉన్నతాధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. విజిలెన్స్ బృందాలు బుధ, గురు, శుక్రవారాల్లో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని రైల్వే వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచాయి. ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగి.. ఒక వైద్యుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి, వేరే విభాగంలో పనిచేసే ఉద్యోగికి ఫిట్/సిక్ సర్టిఫికెట్లు జారీ చేశారన్నది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి వచ్చి చాలా కాలం గడిచినా, ఆ ఉద్యోగిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే కాకుండా, ప్రైవేట్ ఆసుపత్రి బిల్లుల చెల్లింపులు, కాంట్రాక్టు ఒప్పందాల విషయంలో కూడా భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, వీటిపై కూడా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. కొందరు ఉన్న తాధికారులే ఈ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయిన కొందరు సిబ్బంది, బదిలీ అయినా కూడా ప్రజాప్రతినిధులు, మంత్రుల స్థాయిలో పైరవీలు చేసుకుని తిరిగి ఇక్కడికే వస్తున్నారని రైల్వే ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిని తక్షణమే బదిలీ చేసి, పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


