నరకాసుర హైడ్రో పవర్‌భూతం దహనం
● ఈనెల 24న చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి
● గిరిజన సంఘం జిల్లా
ప్రధాన కార్యదర్శి బాలదేవ్
అరకులోయటౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మండలంలోని పెదలబుడు పంచాయతీ తాంగులగుడ, ఒల్దీపనస గ్రామాల్లో నరకాసుర హైడ్రోపవర్ భూతం దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ, అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన జీవో నంబర్ 2, 13, 51 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి ప్రతులను దీపావళి పండగ సందర్భంగా దహనం చేసినట్టు చెప్పారు. గ్రామ సభ తీర్మానం, పీసా కమిటీ తీర్మానం లేకుండా అటవీ, పర్యావరణ అనుమతులను ఏకపక్షంగా ఆగమేఘాల ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివాసీలను మాయమాటలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర ప్రణాళిక కమిటీ పేరుతో జిల్లా యంత్రాంగం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆదివాసీల భూములు, అటవీ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటామన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని ఈనెల 24న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాలదేవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో జగన్నాథం, కొర్రా మగ్గన్న, తాంగుల హరి, బురిడి నర్సింగరావు, రవి కుమార్, రాజు, మహిళలు పాల్గొన్నారు.


