కాఫీ
విరగ్గాసిన
సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీతోటలు ఈఏడాది కూడా విరగ్గాసాయి. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో కాఫీ తోటలు కళకళలాడుతున్నాయి. దీంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే అధికంగా వర్షాలు కురవడంతో కాఫీతోటలకు మేలు చేసింది. ముందస్తు పూతతో పాటు కాయ దశ ఏర్పడడంతో అధిక దిగుబడులు వస్తాయని కాఫీ రైతులు ఆశిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల పరిధిలో 2.20 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సాగు చేస్తుండగా, 1.50 లక్షల ఎకరాల తోటలు ఫలాసాయం ఇస్తున్నాయి.ఈ ఏడాది మరో 1000 ఎకరాల్లోని మొక్కలు కొత్తగా ఫలసాయం ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో గత ఏడాది కన్న దిగుబడులు పెరుగుతాయని కేంద్ర కాఫీబోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు తెలిపారు.
గత ఏడాది ఇలా...
11 మండలాల పరిధిలో గత ఏడాది 15వేల టన్నుల క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు మార్కెటింగ్ చేశారు.ఐటీడీఏ ఆధీనంలోని మాక్స్ సంస్థ, గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, జీసీసీ, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా బెంగళూరు మార్కెట్‌లో భారీగా కాఫీ గింజల వ్యాపారం జరిగింది. గత ఏడాది సీజన్ చివరిలో కిలో పాచ్‌మెంట్ కాఫీ గింజలకు రూ.500 వరకూ ధర పలికింది. మొదట్లో విక్రయించిన రైతులకు లాభాలు తగ్గగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో విక్రయించిన రైతులు మాత్రం మంచి లాభాలు పొందారు. ఎకరం కాఫీ తోటకు 150 కిలోల వరకు దిగుబడి రావడంతో రైతులు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం పొందారు. నాణ్యమైన కాఫీ గింజలు కావడంతో మన్యం కాఫీకి గిరాకీ ఏర్పడింది.
ఈ ఏడాది కాపు అధికం
ఈఏడాది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో కాపు ఆశాజనకంగా ఉంది. పూత,గింజ దశ త్వరగా రావడంతో కాపు అధికంగా ఉంది. ప్రస్తుతం కాఫీ పంట పండ్ల దశలో కళకళాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు కూడా కాఫీ పంటకు ఎంతో మేలు చేశాయి. నవంబర్ మొదటి వారం నుంచి గిరిజన రైతులు కాఫీ ఫలసాయం సేకరణకు సిద్ధమవుతున్నారు. పండ్ల దశలోనే కొనుగోలుకు ఐటీడీఏ మాక్స్, నాంది, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సిద్ధమవుతుండగా, పార్చ్‌మెంట్ గింజలు, చెర్రీ రకాన్ని కొనుగోలు చేసేందుకు జీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. మరో వారం రోజుల్లో పండ్లు, గింజల ధరలను ప్రకటించనున్నాయి. ఈఏడాది కూడా సుమారు 16వేల టన్నుల కాఫీగింజల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు.
కిలో రూ.500కుకొనుగోలు చేయాలి
కాఫీతోటలకు కాపు అధికంగానే ఉంది. గత ఏడాది వలే అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వం జీసీసీ ద్వారా కిలో రూ.500 ధరతో పాచ్‌మెంట్ కాఫీ గింజలను కొనుగోలు చేయాలి. ఐటీడీఏ కూడా కాఫీ పండ్ల కు కిలోకు రూ.100 ధర చెల్లిస్తే కాఫీ రైతులకు మేలు జరుగుతుంది. – పాలికి లక్కు, కాఫీ రైతుల
సంక్షేమ సంఘం నేత, గుర్రగరువు, పాడేరు
గిట్టుబాటు ధర కల్పిస్తాం
కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంగా అధికారులను సమాయత్తపరుస్తున్నాం. గత ఏడాది గిరిజన రైతులు మంచి లాభాలు పొందారు. జీసీసీ కూడా గిట్టుబాటు ధరతోనే కొనుగోలు చేసింది. ఈ సారి కూడా కాఫీ అమ్మకాల ద్వారా అధిక ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకుంటాం.
– ఎ.ఎస్.దినేష్‌కుమార్, కలెక్టర్
పండ్ల దశలో కాఫీతోటలు
అఽధిక దిగుబడులపై రైతుల ఆశలు
గత ఏడాది 15వేల టన్నుల
కాఫీ గింజల దిగుబడి
ఈఏడాది మరింత పెరిగే అవకాశం
కాఫీ
కాఫీ


