
‘హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి’
చింతపల్లి: మండలంలో గొందిపాకలు పంచాయతీ సమ్మగిరిలో ప్రభుత్వం మంజూరు చేసిన హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. సమ్మగిరి గ్రామ గిరిజనులు తమ సంప్రదాయ ఆయుధాలతో శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం రహస్య సర్వేలు చేస్తున్నప్పటి నుంచి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో అనంతగిరి,అరుకువేలి,హుకుంపేటతో పాటు చింతపల్లి కొయ్యూరు మండలాల సరిహద్దు ఎర్రవరంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు లైన్ క్లియర్ చేస్తూ 459 పేజీల అనుమతిప్రతులను విడుదల చేసిందన్నారు.గిరిజన చట్టాలను, మనోభావాలను గౌరవిస్తామంటూనే తీవ్రమైన అన్యాయానికి కూట మి ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణాల వల్ల 180 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందన్నారు.ఈప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. సీసీఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్,మాజీ సర్పంచ్ బెన్నాస్వామి,నాయకులు సత్తిబాబు,సోమరాజు,వెంకటేశ్వర్లు బాలన్న తదితరులు పాల్గొన్నారు.