
అసంపూర్తి భవనంలోనే పాఠశాల
● తక్షణం పూర్తి చేయాలని విద్యార్థుల డిమాండ్
జి.మాడుగుల: మండలంలోని వంతాల పంచాయతీ రాసపనుకు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2022లో ఇక్కడ పాఠశాల భవన నిర్మాణానికి నాడు–నేడు రెండో విడతలో రూ.13,71,700 మంజూరైంది. ఈ నిధుల్లో రూ.7,75, 715 విడుదల అయింది. వీటిలో రూ.7,74,530ను భవన నిర్మాణానికి వెచ్చించారు. శ్లాబ్ స్థాయి వరకు పనులు జరిగాయి. మిగతా నిధులు మంజూరు కానుందున పనులు అప్పటినుంచి నిలిచిపోయాయి. అయితే భవన వసతి లేనందున పాఠశాలను అసంపూర్తి భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. రికార్డులు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం సామగ్రి భద్రపరచుకునేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తక్షణ పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని విద్యార్థులు బుధవారం డిమాండ్ చేశారు. దీనిపై ఎంఈవో బాబూరావు పడాల్‌ను వివరణ కోరగా నిధులు విడుదల అయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు.