
మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతపల్లి: గిరిజన రైతులు పసుపుసాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి బొడ్డు కళ్యాణి అన్నారు. తాజంగి పంచాయతీ పరిధిలోని పినపాడు గ్రామంలో ’పసుపు సాగులో నూతన యాజమాన్య పద్ధతులు, నాణ్యత ప్రమాణాల మెరగు అంశంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు పసుపు పంటలో విత్తన శుద్ధి చేసుకొని సాగు చేయాలని, దీంతో తెగుళ్లను నివారించవచ్చన్నారు. ఎతైన బెడ్లపై పంటను సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పసుపు ఉడకపెట్టే యంత్రాలు, వాష్ స్పైషర్ పాలిష్ యంత్రాలను 75 శాతం రాయితీపై అందజేస్తున్నట్టు తెలిపారు. రైతు ఉత్పత్తిదారులు సంఘాలు, ఎఫ్‌పీవోలకు 90 శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రైతులు ఆయా పథకాలు పొందేందుకు ఆధార్, కుల, ఆదాయ, బ్యాంకు అకౌంట్ ధ్రువపత్రాలతో స్పైస్ బోర్డు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేష్‌బాబు, టాటా ట్రస్టు నిపుణుడు డాక్టర్ అప్పారావు, ఎఫ్‌పీవో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.