
ఐటీడీఏ పీవోగా శ్రీపూజ బాధ్యతల స్వీకరణ
పాడేరు: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నూతన ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ సోమవారం ఉదయం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపండి గ్రామానికి చెందిన శ్రీపూజ తన రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌లో ఆలిండియా 62వ ర్యాంకు సాధించి, ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇటీవల ఆమెను రాష్ట్ర ప్రభుత్వం పాడేరు ఐటీడీఏకు పూర్తి స్థాయి పీవోగా నియమించింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పనిచేయడం, మన్యవాసులకు సేవ చేయడం తృప్తినిస్తుందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి కార్యక్రమం అర్హులకు అందేలా కృషి చేస్తానన్నారు. ఆమెకు ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పరిపాలనాధికారి హేమలత, డీఆర్డీఏ పీడీ మురళి, పలువురు ఐటీడీఏ అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె కలెక్టర్ దినేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మోదకొండమ్మ తల్లికి పూజలు
ఐటీడీఏ పీవోగా నియమితులైన శ్రీపూజ సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు శ్రీమోదకొండమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. పీవోను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఆలయ కమిటీ ప్రతినిధులు డీపీ రాంబాబు, సతీష్, రామకృష్ణ, చంద్రమోహన్, ఈశ్వర్‌రావు, హరిబాబులు దుశ్శాలువాలతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.