
నేత్రదానంపై అపోహలను వీడాలి
పాడేరు : అన్ని దానాల కన్నా నేత్రధానం ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి అంధత్వంతో భాదపడుతున్న వారికి చూపు ప్రసాదించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. అందత్వ నివారణ సంస్థ ఆద్వర్యంలో 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శనివారం పాడేరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి నుంచి మెయిన్ బజారు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నేత్రధానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అనీష్‌బాబు, ఏఎన్‌ఎం ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతికుమారి, ట్రైనింగ్ సెంటర్ విద్యార్ధులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.